సొంత ఊర్లో ఉంటూ ఎంతో కొంతా సంపాదించాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అయ్యింది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో రేషన్ పంపిణీ చేసేందుకు డీలర్లు లేరు. దాంతో ప్రతి నెల రేషన్ తీసుకునే పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ డీలర్ల నియామకానికి సంబంధించి వివిధ రెవెన్యూ డివిజన్లో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కేవలం పదో తరగతి పాస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని మొత్తం 192 రేషన్ డీలర్ల నియామకం, దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు దాఖలకు ఈనెల 28 ఆఖరు తేదీగా నిర్ణయించారు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ద్వారా ఎంపిక ఉంటుంది.రేపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 46 రేషన్ డీలర్లు, మూడు బై ఫరగేషన్ (విభజిత) దుకాణాలు మొత్తం 49 రేషన్ డీలర్లు, దుకాణాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆర్డీవో నేలపు రామలక్ష్మి తెలిపారు. రేపల్లె పట్టణం, మండలంలో 8, నగరంలో 8, చుండూరులో 8, చెరుకుపల్లిలో 6, నిజాంపట్నంలో 5, భట్టిప్రోలులో 5, అమర్తలూరులో 3, కొల్లూరులో 3, వేమూరులో 3 చొప్పన భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని పది మండలాల్లో 139 రెగ్యులర్ డీలర్ షాప్లు, 4 కొత్త షాప్లు మొత్తం 143 రేషన్ దుఖాణాలు, డీలర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చీరాల ఆర్డీవో పి.చంద్రశేఖర్ నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో రేషన్ డీలర్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే కనీసం పదో తరగతి పాస్ ఉంటే సరిపోతుంది. అలాగే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లకు దరఖాస్తు చేయాలంటే ఇంటర్మీడియట్ ఉండాలి. వయసు 18 నుంచి 40 వరకు ఉండాలి. ఇక సొంత గ్రామం వారికే అవకాశం ఉంటుంది. విద్యా వాలంటీర్లు, ఏఎన్ఎంలు, చదువుకుంటున్నవారు, ఆశ కార్యకర్తలు, ఇతర ఉద్యోగాలు చేసేవారు అనర్హులు. ఇక ఎలాంటి పోలీసు కేసులు ఉండకూడదు. అభ్యర్థులు నవంబర్ 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 29న దరఖాస్తుల పరిశీలించనున్నారు. అదే రోజు అర్హులైన వారి జాబితా ప్రకటిస్తారు. ఎంపికైన వారికి డిసెంబర్ 2న రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షకు సంబంధించి హాల్ టికెట్స్ నవంబర్ 30న జారీ చేస్తారు. డిసెంబర్ 3న రాత పరీక్షల ఫలితాలు వెల్లడిస్తారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా ప్రచురిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 5న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. డిసెంబర్ 6న ఎంపికైన వారి తుది జాబితాను విడుదల చేస్తారు.