నిరుద్యోగులకి గుడ్ న్యూస్. ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్కో ప్రకటన విడుదల చేసింది. విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ పరిధిలో ఏపీ ట్రాన్ కో, ఏపీపీసీసీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 5 కార్పొరేట్ లాయర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, ఇందులో అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలసి ఉంటుంది. మూడు సంవత్సరాల LLB / LLM లేదా ఐదు సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ లా కోర్సు పూర్తి చేయాలి. వయోపరిమితి లేదు. కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉండాలి.
విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ప్రాథమిక షార్ట్ లిస్టింగ్ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఏడాది కాలానికి ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అనంతరం పనితీరు ఆధారంగా ప్రతిసారీ పదవీ కాలం పొడిగిస్తారు. ఇక నెల వేతనం లక్షా 20వేల రూపాయలు ఉంటుంది. ప్రతిరోజూ కార్పొరేట్ కార్యాలయంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒప్పందాల ముసాయిదాలు, చట్టపరమైన కేసుల విచారణలు, పారా వైజ్ రిమార్క్లను సిద్ధం చేయడం, హైకోర్టు, ఇతర న్యాయస్థానాలు ఏదైనా సంబంధిత అధికారులు అప్పగించిన ఇతర పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.
సూచించిన ఆకృతిలో ఎన్క్లోజర్లతో పాటు దరఖాస్తులను నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజులలోపు ఈ అడ్రస్ కు పంపాలి.ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, APTRANSCO, విద్యుత్ సౌధ, గుణదల, విజయవాడ -520004. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే నవరత్న కంపెనీలలో ఒకటైన ఎడ్సిల్ లిమిటెడ్లో కాంట్రాక్టు ప్రాతిపదికన కౌన్సిలర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఎడ్ సిల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. 26 జిల్లాల్లో మొత్తం 255 మంది కౌన్సిలర్లను నియమిస్తారు. దీంతో పాటు పిఎంయు సభ్యులు, కో ఆర్డినేటర్లుగా ఇద్దరిని నియమిస్తారు. భారత పౌరులై తెలుగులో మాట్లాడటం, రాయడంతో పాటు భాషపై పట్టున్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కౌన్సిలింగ్లో కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. గరిష్టంగా 35ఏళ్ల లోపు వయసు ఉండాలి.