Pawan Kalyan : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పలు వివాదాస్పద కామెంట్స్‌తో వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆయా పోలీస్ స్టేసన్లలో ఫిర్యాదు చేయడంతో వర్మపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదైంది.ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని రామ్‌గోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. ముందస్తు బెయిల్ పై తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అయితే విచారణకు హాజరుకాకపోవడంతో…ఆర్జీవీ పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.
రామ్ గోపాల్ వర్మ కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న అభియోగాలపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో ఆర్జీవీపై పలు కేసులు నమోదు కాగా, ఒంగోలులో నమోదైన కేసులో విచారణకు హాజరవ్వాలని ఇప్పటికే రెండుసార్లు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. అయినా ఆర్జీవీ విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడులో ఆర్జీవీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఉదయం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రామ్‌గోపాల్ వర్మతో పాటుగా పలువురు నోటీసులు అందుకుని కూడా విచారణకు రాలేదని.. అయితే దీనిపై తాను ఇప్పుడేమీ స్పందించనంటూ పవన్ కళ్యాణ్ అన్నారు.
ఈ విషయంలో పోలీసులను వారి పని వారిని చేసుకోనివ్వాలని చెప్పారు. హోం శాఖ, శాంతిభద్రతలు తన పరిధిలో లేవన్న పవన్ కళ్యాణ్.. తనకు అప్పగించిన శాఖలపై మాట్లాడాలంటే మాట్లాడతానని చెప్పారు. ఏవైనా ఉంటే అడగాల్సింది సీఎం చంద్రబాబు నాయుడునని చెప్పారు. శాంతిభద్రతల అంశం హోంమంత్రి పరిధిలోదని.. హోం మంత్రి చూస్తారని, తాను చెయ్యడం లేదంటూ నవ్వుతూ బదులిచ్చారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టిన సమయంలో ధైర్యంగా వ్యవహరించిన ఏపీ పోలీసులు.. ఇప్పుడెందుకు తటపటాయిస్తున్నారనేదీ ముఖ్యమంత్రిని అడుగుతానని.. అలాగే ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నలను ఆయన వద్ద ప్రస్తావిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.