Allu Arjun : పుష్ప2 ప్రీమియర్ షో సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్లో రేవతి అనే మహిళా అభిమాని మృతి చెందిన విషయం తెలిసిందే. థియేటర్‌కు ముందస్తు సమాచారం లేకుండా అల్లు అర్జున్ కూడా మూవీని చూసేందుకు రావడంతో, అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే రేవతి మృతిపై చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌పై కేసు కూడా నమోదు చేశారు. సంథ్య థియేటర్ యాజమాన్యంపై తగు చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు.
ఇక రేవతి మృతిపై తాజాగా అల్లు అర్జున్ స్పందించారు.అందరికీ నమస్కారం మొన్న మేము ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి వెళ్ళాను. అనుకోకుండా క్రౌడ్ ఎక్కువ కావడంతో, అక్కడికి వచ్చిన ఫ్యామిలీకి దెబ్బలు తగిలాయని మాకు తెలిసింది. సినిమా చూసి వచ్చిన తర్వాత మర్నాడు ఉదయం మాకు తెలిసింది… దురదృష్టవశాత్తు రేవతి అనే అభిమాని మృతి చెందారు అని. ఆవిడకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని. ఆ విషయం తెలిసిన వెంటనే మేము అంతా చాలా డిజప్పాయింట్ అయ్యాం.గత 20 ఏళ్లుగా ప్రతి సినిమాను అభిమానులతో కలిసి మెయిన్ థియేటర్లో చూడడం తనకు అలవాటు అని చెప్పిన అల్లు అర్జున్, గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఎటువంటి ఘటన జరగలేదని, ఇప్పుడు జరిగిన ఘటన తనను ఎంతో బాధించిందని చెప్పుకొచ్చారు.
రేవతి గారు మృతి చెందిన వార్త తెలియగానే.. మేము పుష్ప 2 సెలబ్రేషన్స్‌లో యాక్టీవ్‌గా పాల్గొనలేకపోయాం. మేము సినిమాలు తీసేదే.. ప్రేక్షకులు థియేటర్లకి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటిది థియేటర్ వద్ద ఇలా జరగడం చాలా బాధించింది. రేవతి గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మేము ఏం చేసినా.. రేవతి గారు లేని లోటుని ఆ ఫ్యామిలీకి తీర్చలేం. కానీ.. ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాం. నా తరఫున రేవతి గారి కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నా. ఆమె కొడుకు ఆసుపత్రి ఖర్చులు కూడా మేమే భరిస్తాం’’ అని అల్లు అర్జున్ స్పష్టం చేశారు.తాను వాళ్లకు అండగా ఉన్నానని చెప్పడం కోసమే పాతిక లక్షలు ఇస్తున్నానని వాళ్లకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా తాను ఇస్తానని ఆయన తెలిపారు.