Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం అతి పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్ చిత్రం ఖచ్చితంగా బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్ధలు కొడుతుందని ట్రేడ్ పండితులు ముందే అంచనా వేశారు. రెండ్రోజుల్లోనే రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లతో అల్లు అర్జున్ తన పేరిట సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. ఇక ఈ మూవీ ఇంత విజయం సాధించడంతో మేకర్స్ సక్సెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన సక్సెస్ మీట్లో బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్ చెప్పారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ తర్వాత థాంక్యూ కళ్యాణ్ బాబాయ్ ప్రత్యేకంగా సంభోధించారు. అదే సందర్భంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా థాంక్స్ చెప్పారు . అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోయారని కొందరు అంటున్నారు. అందుకు కారణం.. ఎక్కువ సేపు మాట్లాడటం వల్ల మంచినీళ్లు తాగడం కోసం గ్యాప్ ఇచ్చారు. దానికి ముందు తెలంగాణ సీఎం అనడంతో రేవంత్ రెడ్డి పేరు మరచిపోయారంటూ క్లిప్ వైరల్ అవుతుంది. ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ బన్నీకి తెలుసు. కానీ, ఆయన పూర్తి పేరు తెలియదు. సభావేదిక మీద పూర్తి పేరు చెప్పడం సభ్యత అని ఆయన పేరు అడిగి తెలుసుకుని మరీ చెప్పారు. దాన్ని కూడా కవర్ డ్రైవ్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఒక సినిమా అంటే అందరి కష్టం ఉంటుంది. కానీ అందరికీ హిట్ ఇచ్చేది ఒక వ్యక్తి… అతడే దర్శకుడు. ఇవాళ నాకు పేరొచ్చినా, నిర్మాతలకు పేరొచ్చినా, ఆర్టిస్టులకు పేరొచ్చినా… ఆ ఘనత పూర్తిగా సుకుమార్ కే దక్కుతుంది. ఇవాళ నాకు ఇన్ని కాంప్లిమెంట్లు వస్తున్నాయంటే ఆయనే కారణం. డార్లింగ్ (సుకుమార్)… ఇంతకంటే నేను ఇంకేం చెప్పగలను! తీసుకెళ్లి అంత ఎత్తులో కూర్చోబెట్టావు నన్ను. నేను ఇది అహంకారంతో చెప్పడంలేదు… దయచేసి ఎవరూ తప్పుగా అనుకోవద్దు. ఈ సినిమా కలెక్షన్లు ఎంతో కూడా నాకు సరిగా తెలియదు. అంకెలు పక్కన పెట్టేస్తే… మనం ఒక చిన్న ప్రాంతీయ సినీ పరిశ్రమలో ప్రస్థానం ప్రారంభించాం. కానీ ఇవాళ మన చిత్రం దేశంలోనే టాప్ గ్రాసర్ గా నిలిచిందంటే అది చాలా పెద్ద విషయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి” అని పేర్కొన్నారు అల్లు అర్జున్.