పుట్టగొడుగులను తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. పుట్టగొడుగుల్లో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తింటే మనకు పోషణ లభిస్తుంది. ముఖ్యంగా వీటిల్లో విటమిన్ బి12, విటమిన్ డి ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో అవసరం అవుతాయి. అయితే పుట్టగొడుగులతో మీరు ఎప్పుడూ వండే కూర కాకుండా రెస్టారెంట్ స్టైల్లో ఒక్కసారి కడై మష్రూమ్ మసాలాను ట్రై చేసి చూడండి. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. టేస్ట్ ఎంతో బాగుంటుంది. ఈ క్రమంలోనే కడై మష్రూమ్ మసాలాను ఎలా తయారు చేయాలో, దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కడై మష్రూమ్ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
పుట్ట గొడుగులు – పావు కిలో, ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి – 1 టీస్పూన్, క్యాప్సికమ్ ముక్కలు – ఒక కప్పు, టమాటాలు – 3, టమాటా కెచప్ – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర – 1 టీస్పూన్, కారం – 1 టీస్పూన్, పసుపు – పావు టీస్పూన్, ధనియాల పొడి – 1 టీస్పూన్, గరం మసాలా – 1 టీస్పూన్, కొత్తిమీర – అర కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – 1 టేబుల్ స్పూన్.
కడై మష్రూమ్ మసాలాను తయారు చేసే విధానం..
పుట్టగొడుగుల్ని శుభ్రంగా చల్లని నీళ్ల కింద కడిగి తుడిచి సగానికి కోయాలి. బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి చిటపటమన్నాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి. కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి సిమ్లో రెంఎడు నిమిషాలు కలుపుతూ వేయించాలి. తరువాత టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు ఉప్పు వేసి నూనె తేలే వరకు వేయించాలి. టమాటా కెచప్ కూడా వేసి కలపాలి. 2 నిమిషాల తరువాత పుట్టగొడుగు ముక్కలు వేసి కలిపి, మూత పెట్టి సిమ్లో ఉడికించాలి. కూర కాస్త దగ్గర పడ్డాక కొత్తిమీర వేసి దించి వడ్డించాలి. ఇది అన్నంలోకి కూడా బాగుంటుంది.