భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ట్రాన్సాక్షన్లకు గాను మరింత సెక్యూరిటీ కల్పించేందుకు, సామర్థ్యాన్ని మెరుగు పరిచేందుకు నూతన నిబంధనలను అమలులోకి తెచ్చింది. డిసెంబర్ 1, 2024 నుంచి కొత్త నియమాలను అమలు చేస్తున్నారు. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి చెల్లింపు యాప్‌ల వినియోగదారులు ఈ మారిన నియమాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి కొన్ని పెద్ద రంగాలకు రోజువారీ యూపీఐ పేమెంట్ లిమిట్‌ను పెంచారు. పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసేందుకు గాను వినియోగదారులు ఇప్పుడు ఈ ప్రదేశాల్లో రోజుకు రూ.5 లక్షల వరకు చెల్లింపులు చేయవచ్చు.
యూపీఐ వినియోగదారులు ఇప్పుడు తమ ఖాతాల్లో నిధులు అందుబాటులో లేకపోయినా చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తూ ముందుగా ఆమోదించబడిన క్రెడిట్ లైన్లను ఉపయోగించుకోవచ్చు. ఈ సదుపాయాన్ని వ్యక్తిగత, వ్యాపార లావాదేవీల కోసం ఉపయోగించవచ్చు. కస్టమర్లకు ఇది మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. నగదు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ఏటీఎం కార్డు అవసరాన్ని తొలగిస్తుంది. దీంతో నగదు ఉపసంహరణ ప్రక్రియ సులభతరం అవుతుంది.
మొదటిసారి యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా డబ్బులు పంపే వారికి ఇప్పుడు 4 గంటల కూలింగ్ పీరియడ్ సమయం తప్పనిసరిగా ఉండాలి. ఈ కాలంలో కస్టమర్లు తమ మొదటి పేమెంట్‌ను రూ.2వేల వరకు ఎటువంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేయవచ్చు. దీంతో వినియోగదారుల చెల్లింపులకు మరింత భద్రత లభిస్తుంది. దీంతో మనశ్శాంతిగా ఉండవచ్చు. యూపీఐ వినియోగదారులు ఈ మార్పులను గురించి తెలుసుకుంటే తాము చేసే చెల్లింపులు మరింత సురక్షితంగా ఉంటాయి. అలాగే ఎలాంటి మోసాలకు గురికాకుండా ఉండవచ్చు. డబ్బును సురక్షితంగా ఉంచుకోవచ్చు.