Mohan Babu : ప్రస్తుతం మంచు ఫ్యామిలీ వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. మంచు మనోజ్ ను ఇంటి నుంచి వెళ్లిపోవాలని మోహన్ బాబు సూచించడంతో… ఆయన తన వస్తువులు తరలించేందుకు మూడు భారీ వాహనాలు తీసుకొచ్చారు. ఈ క్రమంలో మనోజ్ దంపతులు మోహన్ బాబు ఇంటికి రాగా…సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మనోజ్ వాహనాన్ని గేటు వద్దే నిలిపివేశారు. దీంతో కారు దిగి గేట్లను తోసుకుంటూ మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఈ తతంగాన్ని కవర్ చేస్తున్న మీడియాపై కూడా మోహన్ బాబు చేయి చేసుకున్నాడు. బండ బూతులు తిట్టాడు. మరోవైపు మోహన్ బాబు, విష్ణు గన్స్ సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
కుటుంబ వివాదంపై సినీనటుడు మోహన్‌బాబు స్పందించారు “మనోజ్ నువ్వు నా బిడ్డవి. లక్ష్మీప్రసన్న, విష్ణువర్ధన్‌బాబు, మనోజ్ కుమార్ మిమ్మల్ని ఎలా పెంచాను? అందరికంటే నిన్నే ఎంతో గారాబంగా పెంచాను. అందరికంటే నీకే ఎక్కువ ఖర్చుపెట్టి చదివించాలని చూశాను. నువ్వు ఏది అడిగినా ఇచ్చాను. నువ్వు ఈరోజు నా గుండెల మీద తన్నావు మనోజ్. నా మనసు ఆవేదనతో కుంగిపోతుంది. కొన్ని కారణాల వల్ల ఇద్దరం గొడవ పడ్డాం. ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి. జల్పల్లిలోని ఇల్లు నా కష్టార్జితం. ఈ ఇంటితో నీకు సంబంధం లేదు. మనోజ్ మద్యానికి బానిసై పోయాడు. మద్యం మత్తులో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు.నా పరువు ప్రఖ్యాతలు మంటగలిపావు ఇక చాలు.
ఆస్తులు ముగ్గురికీ సమానంగా ఇవ్వాలా? వద్దా? అనేది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా? దాన ధర్మాలు చేస్తానా? అనేది నా ఇష్టం. నా ఇంట్లో అడుగుపెట్టే అధికారం నీకు లేదు. మనోజ్ నీ వల్ల మీ అమ్మ ఆసుపత్రి పాలైంది. భార్య మాటలు విని తాగుడుకు బానిసై ఇలా ప్రవర్తిస్తున్నావు. ఇక చాలు ఇంతటితో ఈ గొడవను ముగిద్దాం” అని మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు. కాగా, రేపు ఉదయం రాచకొండ సీపీ ఎదుట హాజరు కావాలంటూ మోహన్ బాబుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబు చేరారు. మంచు విష్ణుతో కలిసి కాంటినెంటల్ ఆసుపత్రికి ఆయన వెళ్లారు. మోహన్ బాబుకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మోహన్ బాబు, విష్ణు నుంచి లైసెన్స్డ్ తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబు చేరారు. మంచు విష్ణుతో కలిసి కాంటినెంటల్ ఆసుపత్రికి ఆయన వెళ్లారు. మోహన్ బాబుకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది