ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, మంగళగిరి, గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో పలు ఖాళీగా ఉన్న పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో మొత్తం 97 పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేయనున్నారు. గైనకాలజీ 21, అనస్తీషియా 10, పీడియాట్రిక్స్ 6, జనరల్ మెడిసిన్ 12, జనరల్ సర్జరీ 19, ఆర్థోపెడిక్స్ 2, ఆప్తల్మాలజీ 5, రేడియాలజీ 2, ఈఎన్‌టీ 5, డెర్మటాలజీ 2, ఫోరెన్సిక్ మెడిసిన్ 2, సైకియాట్రి 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టులు 4 భర్తీ చేస్తారు. ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు గాను డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ, డీఎన్‌బీ తదితర కోర్సులు చేసినవారు అర్హులు. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.61,960 నుంచి రూ.1,51,370 వరకు ఇస్తారు. దరఖాస్తు చేసే నాటికి ఓసీలకు 42 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు 47 ఏళ్లు, దివ్యాంగులకు 52 ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు 50 ఏళ్లు వయస్సు మించకూడదు. దరఖాస్తు ఫీజు రూ.1000 చెల్లించాలి. రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన వారు రూ.500 చెల్లించాలి.
ఈ పోస్టులకు గాను విద్యార్హతలు, మెరిట్ లిస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు డిసెంబర్ 13ను చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు https://hmfw.ap.gov.in అనే అధికారిక సైట్‌ను అభ్యర్థులు సందర్శించవచ్చు.