Mohan Babu : మోహ‌న్ బాబు దాడి చేసిన మీడియా ప్ర‌తినిథికి మూడు చోట్ల బోన్ ఫ్రాక్చ‌ర్

Mohan Babu : మోహ‌న్ బాబు దాడి చేసిన మీడియా ప్ర‌తినిథికి మూడు చోట్ల బోన్ ఫ్రాక్చ‌ర్

Mohan Babu : గ‌త కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతుంది. ఇంట్లో సెట్ చేసుకోవ‌ల్సింది పోయి రోడ్డుకెక్క‌డంతో వారి ప‌రువు మంట‌గలిసింది. గత మూడు రోజులుగా మంచు ఇంటి గొడవలు ర‌చ్చ‌కెక్కాయి. ఆ గొడవలు ఇప్పుడు మరింత ముదిరి తారాస్థాయికి చేరాయి. మోహన్‌బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్‌ మధ్య చోటుచేసుకున్న వివాదం.. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద మనోజ్‌ బౌన్సర్లు, మోహన్‌బాబుకు రక్షణగా ఆయన పెద్ద కుమారుడు విష్ణు నియమించిన బౌన్సర్లకు మధ్య ఘర్షణ జరిగింది. మనోజ్‌, మౌనికలను మోహన్‌బాబు ఇంట్లోకి రానివ్వకపోవడంతో.. మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వివాదం మ‌రింత పెద్ద‌దైంది.

మంగళవారం రాత్రి జరిగిన తోపులాటలో మోహన్‌బాబు గాయపడ్డారంటున్న ఆయన పీఆర్‌ టీమ్‌.. తలకు గాయమైనట్టు చెబుతున్నారు. రాత్రి నుంచి వైద్యుల పర్యవేక్షణలో మోహన్‌బాబుకి ట్రీట్‌మెంట్‌ జరుగుతోందని.. ఇంకా వైద్యపరీక్షలు కొనసాగుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. మ‌రి కొద్ది గంట‌ల‌లో మోహ‌న్ బాబు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు మోహన్‌బాబు చేసిన‌ దాడిలో గాయపడిన టీవీ9 ప్రతినిధి తలకు మూడు లెవెల్స్‌లో ఫ్రాక్చర్‌ అయ్యింది. మీడియా ప్ర‌తినిథి అయిన రంజిత్‌కు కంటికి, చెవికి మధ్య మూడు చోట్ల జైగోమాటిక్ ఎముక విరిగింది. ఈ ఘటనలో మోహన్ బాబుపై బీఎన్ఎస్ సెక్ష‌న్‌ 118 (1) కింద‌ కేసు నమోదు చేశారు పోలీసులు. విధినిర్వహణలో ఉన్న వ్య‌క్తిపై మోహన్‌బాబు దాడిచేశారని.. ఉద్దేశపూర్వకంగా అతని మైకు, ఫోన్‌ లాక్కున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

రిపోర్టర్‌ను దుర్భాషలాడుతూ, బూతులు తిడుతూ.. స్టీల్‌పైప్‌, మెటల్‌ లోగో ఉన్న మైకుతో భౌతికదాడికి పాల్పడ్డట్లుగా తెలిపారు. కాగా, జర్నలిస్టులపై దాడి ఘటనను టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ ఆలీ తీవ్రంగా ఖండించారు. మోహన్ బాబు రౌడీ షీటర్ మాదిరిగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. మీడియా స్వేచ్చకు భంగం కలిగించడం సరికాదని ఆయన హితవు పలికారు. మోహన్‌ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని టీయూడబ్ల్యుజే జనరల్ సెక్రటరీ మారుతీ సాగర్ డిమాండ్ చేశారు. మోహన్ బాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏపీ, తెలంగాణ వీడియో జర్నలిస్టు అసోసియేషన్ కూడా మోహన్ బాబు చర్యలను ఖండించింది.