చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐవోటీ) పలు విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 152 సైంటిస్టు పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేయనున్నారు. ప్రాజెక్టు సైంటిస్టు పోస్టులు 42 ఖాళీ ఉండగా, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు 45, ప్రాజెక్ట్ టెక్నిషియన్ 19, ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 10, ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్ 12, రీసెర్చ్ అసోసియేట్ (ఆర్ఏ) 6, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు 13, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు 5 ఖాళీగా ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ లేదా బీటెక్, ఎమ్మెస్సీ, ఎంఈ లేదా ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీ చదివి ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు. వయస్సు 50 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ పోస్టులకు గాను అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలను జనవరి 6 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను సమర్పించేందుకు గాను డిసెంబర్ 23ను చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://www.niot.res.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.