IDBI Bank JAM Recruitment 2024 : దేశవ్యాప్తంగా పలు జోన్లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఐడీబీఐ బ్యాంకు తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ వ్యాంకుకు చెందిన పలు జోన్లలో మొత్తం 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు గాను నవంబర్ 30వ తేదీ వరకు గడువు విధించారు. మరిన్ని వివరాలకు https://www.idbibank.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సందర్శించవచ్చు.
మొత్తం 600 పోస్టులు ఖాళీగా ఉండగా వాటిల్లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 500, అగ్రి అసెట్ ఆఫీసర్ (ఏఏఓ) స్పెషలిస్ట్ పోస్టులు 100 ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, కొచ్చి, ముంబయి, నాగ్‌పుర్, పుణె జోన్లలో పనిచేయాల్సి ఉంటుంది. గ్రేడ్ ఒ జనరల్ పోస్టులకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని చదివి ఉండాలి. గ్రేడ్ ఒ స్పెషలిస్ట్ పోస్టులకు బీఎస్సీ, బీటెక్, బీఈ (అగ్రికల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫిషరీస్ సైన్స్/ఇంజినీరింగ్, యామినల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, డెయిరీ సైన్స్/టెక్నాలజీ, ఫుడ్ సైన్స్/టెక్నాలజీ, పిసికల్చర్, అగ్రో ఫారెస్ట్రీ, సెరికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులను సాధించి ఉండాలి. అభ్యర్థులు కంప్యూటర్/ఐటఈ సంబంధిత అంశాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 01.10.2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపులను కల్పిస్తున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, పత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.1050 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏలూరు, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ/ గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. అర్హులైన వారు, ఆసక్తి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.