అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం పుష్ప2. ఈ సినిమా ఇప్పుడు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే పుష్ప2పై కొన్ని చోట్ల నెగెటివిటీ కూడా నడుస్తుంది.‘పుష్ప 2’ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగా మాస్ జాతర చూపిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 400 కోట్లు కొల్లగొట్టి, పుష్పరాజ్ సత్తా ఏంటో నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు భారీ సంఖ్యలో థియేటర్లు కేటాయించడంపై నార్త్ లో విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘పుష్ప 2’ మూవీ రిలీజ్ కారణంగా హాలీవుడ్ హిట్ మూవీ ‘ఇంటర్ స్టెల్లార్’ రీరిలీజ్ వాయిదా పడింది అని కొందరు అసహనం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో జాన్వీ కపూర్ తన సోషల్ మీడియా వేదికగా పుష్ప2పై ట్రోల్స్ చేసే వారికి గట్టిగా ఇచ్చిపడేసింది. హాలీవుడ్ వారే మన సినిమాలను మెచ్చుకుంటున్నారని, కానీ మనం మాత్రం మన చిత్రాలను తక్కువ చేసుకుంటున్నామంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “పుష్ప-2 కూడా ఒక సినిమానే కదా. ఈ చిత్రాన్ని మరొక దానితో పోలుస్తూ తక్కువ చేయడం ఎంతవరకు సబబు? మీరు ఏదైతే హాలీవుడ్ మూవీకి మద్దతు ఇస్తున్నారో వారే ఇప్పుడు మన చిత్రాలను మెచ్చుకుంటున్నారు. కానీ మనం మాత్రం మన చిత్రాలను ఇంకా తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకుంటున్నాం. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది” అని జాన్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, బాలీవుడ్‌లో ‘పుష్ప-2’ సినిమా తొలిరోజు ఏకంగా రూ.72 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఏ హిందీ సినిమా కూడా మొదటి రోజున ఇంత భారీ కలెక్షన్లు రాబట్టింది లేదు. బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ చిత్రం హిందీ వెర్షన్ తొలి రోజు వసూళ్లు రూ.65.5 కోట్లు కాగా… ఇప్పుడది ‘పుష్ప-2’ దెబ్బకు రెండో స్థానానికి పరిమితమైంది. కాగా, హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నటించిన ఈ చిత్రం 2014లో విడుదలైంది. తాజాగా ఈ మూవీ విడుదలై పదేళ్లు పూర్తి చేసుకోవడంతో దీన్ని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.