Jani Master : జానీ మాస్ట‌ర్‌ని డ్యాన్స్ అసోసియేష‌న్ నుండి తొల‌గించారంటూ వార్త‌లు.. వారిపై చ‌ర్య‌లు తీసుకుంటాన‌న్న కొరియోగ్రాఫ‌ర్

Jani Master : జానీ మాస్ట‌ర్‌ని డ్యాన్స్ అసోసియేష‌న్ నుండి తొల‌గించారంటూ వార్త‌లు.. వారిపై చ‌ర్య‌లు తీసుకుంటాన‌న్న కొరియోగ్రాఫ‌ర్

Jani Master :  ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్టార్ హీరోల సినిమాల‌కి కూడా కొరియోగ్రాఫ‌ర్ చేస్తూ మంచి పేరు ప్ర‌ఖ్యాతలు అందుకున్నాడు. . జూనియర్ కొరియా గ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు ఇప్పటికే జాతీయ అవార్డు తిరస్కరించగా.. ఇప్పుడు ఆయన్ను టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ల అసోసియేషన్ నుంచి కూడా శాశ్వతంగా తొలగించారంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఇవాళ ఆయన స్పందించారు. డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ కు ఎన్నికలు జరిగాయని, ఈ సంఘానికి నూతన అధ్యక్షుడు ఎన్నికవగా, జానీ మాస్టర్ ను శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో, జానీ మాస్టర్ స్పందించారు. తనను యూనియన్ నుంచి తొలగించినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు ఇంకా నిరూపితం కాలేదని, ఆరోపణల కారణంగా తనను యూనియన్ నుంచి తొలగించారని ప్రచారం చేస్తున్నారని వివరించారు. నిర్ధారణ కాని ఆరోపణలని కారణంగా చూపిస్తూ తనను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారని, అవేవీ నమ్మకండని జానీ మాస్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. తన పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పేశారు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళుతున్నానంటూ స్పష్టం చేశారు.

అలాగే టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరని జానీ మాస్టర్ తెలిపారు. తన కొరియోగ్రఫీలో గేమ్ ఛేంజర్ నుండి ఓ మంచి పాట రాబోతుందని, అది మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని జానీ వెల్లడించారు. తద్వారా తనను కాదని ఎన్నికలు నిర్వహించినా తన అవకాశాలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని తేల్చిచెప్పేసినట్లయింది. మరోవైపు గతంలో తనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే జానీ మాస్టర్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదే క్రమంలో బెయిల్ కూడా తీసుకుని బయటికి వచ్చారు.