AR Rahman : ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో సినిమాలకి అద్భుతమైన సంగీతం అందించి స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. రెహమాన్ ఎప్పుడు ఎలాంటి వివాదాలలో నిలిచిన సందర్భం లేదు. అలానే ఫ్యామిలీ విషయాలతో ఎప్పుడు వార్తలలో నిలిచిన సందర్భాలు లేవు. కాని ఇటీవల అతను అందరికి ఊహించని షాక్ ఇచ్చాడు. తాను విడాకులు తీసుకుంటున్నట్లు రెహమాన్ ఇటీవలే ప్రకటించారు. అదేరోజు రెహమాన్ బృందంలోని ఓ మహిళ కూడా తన భర్తతో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఆ క్రమంలో రెహమాన్ పై పలు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రచారాన్ని సదరు మహిళ కొట్టిపారేశారు. ఆ తర్వాత రెహమాన్ తన కెరీర్ లో కొంత బ్రేక్ తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. దీనిపై ఖతీజా తాజాగా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రాంచరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నారని గుర్తుచేశారు. ఖతీజా రెహమాన్ తాజాగా స్పందిస్తూ… తన తండ్రి కెరీర్ విషయంలో జరుగుతున్న ప్రచారం అసత్యమని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం దయచేసి మానుకోవాలంటూ ఇన్ స్టా వేదికగా ఖతీజా అభ్యర్థించారు. ఈ విషయంపై ఇటీవలే తాను ట్విట్టర్ లో వివరణ ఇచ్చానని, అయినా పుకార్లు ఆగడంలేదని వాపోయారు.
తన తండ్రి విషయంలో నిరాధార వార్తలు, కథనాలు ప్రసారం చేయొద్దంటూ ఖతీజా పేర్కొన్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందినట్టు సంబంధిత వార్తను ప్రచురించిన ఓ మీడియాను కోట్ చేస్తూ ఖతీజా వివరణ ఇచ్చారు. రెహమాన్ విడాకుల విషయాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు ఎందుకు అలా విడాకులు తీసుకున్నారంటూ ఇప్పటికీ నెట్టింట చర్చ నడుస్తూనే ఉంది.