Mohan Babu : ఎప్పుడు వివాదాలతో వార్తలలో నిలుస్తూ ఉండే మంచు ఫ్యామిలీ తాజాగా ఆస్తి వివాదంతో కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతుంది.మోహన్‌బాబు, కుమారుడు మంచు మనోజ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. మంచు మనోజ్ కాళ్లకు గాయాలవడంతో బంజారాహిల్స్‌లోని టీఎక్స్ ఆస్పత్రిలో చేరాడు. తనను మోహన్ బాబు కొట్టినట్లుగా మనోజ్ చెప్పినట్టు సమాచారం. అయితే డాక్టర్ రిపోర్ట్ కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలియజేస్తూ రాచకొండ సీపీకి మోహన్ బాబు లేఖ రాశారు. తనకు రక్షణ కల్పించాలని రాచకొండ సీపీని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మంచు మనోజ్ పహాడి షరీఫ్‌లో తనపై 10 మంది వ్యక్తులు దాడి చేశారని, విజయ్, కిరణ్ సీసీటీవీ పుటేజ్ తీసుకెళ్లారని.. తనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో రక్షణ కల్పించాలని మనోజ్ పోలీసులను కోరాడు.
అయితే మోహన్ బాబు కంప్లైట్ చేసిన తర్వాత మంచు మనోజ్ స్పందించాడు.తాను, తన భార్య మౌనిక నుంచి ప్రాణ హాని ఉందంటూ తన తండ్రి మోహన్ బాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు మంచు మనోజ్. తాను తన కుటుంబ ఆస్తి కోసం ఎప్పుడూ ఆశ పడలేదన్నారు. తన కుటుంబ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేశానే తప్ప ఆస్తి గురించి ఆలోచించలేదు అని మంచు మనోజ్ చెప్పారు. తన ముందే తన కుటుంబసభ్యుల్ని కొందరు కొట్టారని తెలిపారు. తన ఇంటిలో ఉండాల్సిన సీసీ కెమెరాలు మాయమయ్యాయని, తన సోదరుడు విష్ణు అనుచరులే సీసీ కెమెరాల ఫుటేజీని మాయం చేశారని మంచు మనోజ్ ఆరోపించారు.
తన తండ్రి మోహన్ బాబు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాట్టుగా కూడా మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. మనోజ్ అన్నారు. మోహన్ బాబు విద్య సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే, తాను అక్రమాలను నిలదీస్తూ.. బాధితుల పక్షాన నిలబడినట్లు తెలిపారు. విష్ణు దుబాయ్‌కు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు. ఈ వివాదంలోకి తన కూతుర్ని కూడా చేర్చడం బాధ కలిగించిందన్నారు. గత కొంత కాలంగా తాను మోహన్ బాబు ఇంటికి దూరంగానే ఉంటున్నట్లు చెప్పారు. ఈ కుటుంబ వ్యవహారాల్లో తనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనకు అండగా ఉండాలని మంచు మనోజ్ కోరారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా ఎంట్రీ ఇవ్వగా.. ఈ రచ్చ మరింత పెద్దదైంది. చివరికి ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి