దేశంలోని ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో ఒకటైన న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 500 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీమా రంగంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే. వారికి ఈ సంస్థ గొప్ప అవకాశాన్ని అందిస్తుందని చెప్పవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం డిగ్రీ చదివి ఉండాలి. లేదా తత్సమానమైన అర్హతను కలిగి ఉండాలి. అభ్యర్థులు తమ ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యాన్ని కలిగి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కటాఫ్ తేదీని డిసెంబర్ 1గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్‌టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 ఏళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, దరఖాస్తులను సమర్పించేందుకు జనవరి 1ని చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు newindia.co.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.40వేలు ఇస్తారు. ప్రాథమిక పరీక్ష, ప్రధాన పరీక్ష, ప్రాంతీయ భాషా పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.