పాన్ కార్డు మారుతోంది.. ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోండి..!

పాన్ కార్డు మారుతోంది.. ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోండి..!

ఇప్పుడు ఆధార్ ఎంత అవ‌స‌ర‌మో, పాన్ కార్డ్ అవ‌స‌రం కూడా అదే విధంగా మారింది. దేశంలో అధికారికంగా అనేక పనులు చేయటానికి ముఖ్యమైన కార్డుల జాబితాలో పాన్ కూడా కీలకమైనదని మనందరికీ తెలిసిందే. ప్రధానంగా ఆర్థిక పరమైన విషయాల్లో పాన్ కార్డు చాలా అవసరమైనది. అయితే కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు 2.0 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే క్యూఆర్ కార్డుతో కొత్త పాన్ కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా రూ.1435 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ప్రాజెక్టుపై ప్రకటన వెలువడిన క్రమంలో ట్యాక్స్ పేయర్లలో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. పాత పాన్ కార్డు పని చేస్తుందా లేదా? కొత్త పాన్ కార్డు తీసుకోవాలంటే ఏం చేయాలి, ఎవరికి వర్తిస్తుంది? అని అడుగుతున్నారు. అయితే ఇలాంటి ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

మీరు కూడా కొత్త పాన్ కార్డ్‌ని క్రియేట్ చేయాలనుకుంటే ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా దాన్ని సృష్టించవచ్చు. ఇక్కడ కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. పాత పాన్ కార్డ్ ఉన్న వ్యక్తులు దానిని ఉపయోగించడం కొనసాగించవచ్చు. కొత్త పాన్‌కార్డును పొందాలనే రూల్‌ లేదు. పాత పాన్‌కార్డునే వాడుకోవచ్చు. మీరు మీ సౌలభ్యం ప్రకారం మీకు కావలసినప్పుడు కొత్త e-PAN కార్డ్‌ని పొందవచ్చు. కొత్త పాన్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కొత్త కార్డులను ఉచితంగా పొందవచ్చు. ఆన్‌లైన్ ద్వారానే పూర్తిగా ఉచితంగా కొత్త కార్డులను పొందవచ్చు. పాత పాన్ కార్డులు పని చేస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులందరికీ కొత్త పాన్ కార్డులను ఉచితంగా జారీ చేయనున్నట్లు తెలిపింది. డిజిటల్ ఇండియా విజన్‌ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు తెలిపింది.

pan 2.0 important facts to know

ఇప్పటికే ఉన్న పాత తెలుపు రంగు లేదా క్యూఆర్ కోడ్ లేని స్మార్ట్ కార్డ్ డిజైన్‌తో ఉన్న పాన్ కార్డులు చెల్లుబాటు అవుతాయని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ పాత డిజైన్‌లను కలిగి ఉన్న పన్ను చెల్లింపుదారులు అదనపు సౌలభ్యం, భద్రత కోసం క్యూఆర్ కోడ్‌ను కలిగి ఉన్న కొత్త పాన్ డిజైన్‌కి అప్‌గ్రేడ్ చేయమని ప్రోత్సహిస్తారు. కొత్త కార్డులు ట్యాంపరింగ్ నిరోధించటానికి దోహదపడతాయి. పైగా వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం క్యూఆర్ కోడ్‌లో ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది. ప్రస్తుతం దేశంలో జారీ అయిన పాన్ కార్డుల్లో 98 శాతం పాత పాన్ కార్డు హోల్డర్లే ఉన్నారు. పాన్ 2.0 అనేది ప్రస్తుత పాన్ ఐటీ సిస్టమ్‌కి అప్‌గ్రేడ్ వర్షన్ వంటిది. డూప్లికేషన్ తగ్గించడం, క్రాస్ సెక్షన్ వెరిఫికేషన్, సులభంగా అథెంటికేట్ చేయడం, డిజిటల్ యుటిలిటీ మెరుగుపరచడం అనేవి ఈ కొత్త ప్రాజెక్టు లక్ష్యాలు.ఇప్పటికే ఉన్న పాన్ కార్డుదారులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ఉచితంగా కొత్త కార్డులను జారీ చేయనుంది.