Pawan Kalyan : రాజకీయాలతో కొన్నాళ్లుగా బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తను కమిటైన సినిమాలని పూర్తి చేసే పనిలో పడ్డారు.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ మళ్లీ మొదలు పెట్టారు. అంతేకాదు ఈ మూవీ రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సమ్మర్ లో పవన్ ఈ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఎపిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో రిలీజ్ కానున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఇక మూవీ సెట్స్‌లోకి పవన్ కళ్యాణ్ కూడా అడుగుపెట్టారు.
ఇటీవల చిత్ర బృందం, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించింది. పవన్ కళ్యాణ్‌తో పాటు 400 – 500 మంది పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం కోసం యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ని ప్రత్యేకంగా నియమించారు. యుద్ధ సన్నివేశం అద్భుతంగా రావడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ వారాంతంలో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది.ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ తో పాటు, 200 మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్ తో ‘హరి హర వీర మల్లు’ చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది.
ఇక ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పవర్ స్టార్ అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకుని యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు.