Pushpa2 : అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కించిన పుష్ప2 చిత్రం అనేక వాయిదాల తర్వాత డిసెంబర్ 5న విడుదలయ్యేందుకు సిద్ధమైంది.పాన్ ఇండియా స్థాయిలో అనేక భాషలలో మూవీని రిలీజ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాని రిలీజ్‌కి కొద్ది గంటలు ఉందన్న సమయంలో ఊహించని షాక్ ఇచ్చారు. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమాను 12వేలకు పైగా స్క్రీన్స్‌లో వివిధ ఫార్మాట్లలో రిలీజ్ చేసేందుకు చిత్రం యూనిట్ సిద్ధమైంది. అయితే, ప్రస్తుతం 3డీ వెర్షన్‌లో మూవీ విడుదల కావడం లేదని తెలుస్తుంది.
3డీ వెర్షన్‌లోనూ మూవీని షూట్ చేసినప్పటికీ దీని తాలూకు ఎడిటింగ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి అన్ని థియేటర్లలోనూ 2డీ వెర్షన్‌ను మాత్రమే ప్రదర్శించనున్నారని ప్రముఖ సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అంటే 3డీ వెర్షన్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని ఇన్‌సైడ్ టాక్. .. పుష్ప2 3డీ వెర్షన్ రిలీజ్ పోస్ట్పోన్ కావడంతో ఆ వర్షెన్ మూవీని డిసెంబర్13న రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అప్పటికి 3డీ ప్రింట్స్ రెడీ అవుతాయట. ఎగ్జిబిటర్స్కు ఈ మేరకు పుష్ప2 టీం నుంచి సమాచారం అందినట్లు తెలిసింది.
మరి 3డీలో పుష్ప.2 టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ల పరిస్థితి ఏంటనే ప్రశ్నకు ఒక ప్రముఖ మల్టీప్లెక్స్ మేనేజర్ సమాధానం ఇస్తూ… ప్రేక్షకులు నిరాశచెందాల్సిన అవసరం లేదని, 3డీ షోలు క్యాన్సిల్ చేయడం లేదని.. ఆ 3డీ షోల స్థానంలో పుష్ప-2 2డీ వెర్షన్ షోస్ ప్రదర్శిస్తామని తెలిపారు.మరి 3డీ షోస్‌కి ఎక్కువ వసూలు చేస్తారు కదా, వాటి సంగతేంటి అని అడగ్గా ఆ ఛార్జీలను రిఫండ్ చేస్తామని చెప్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌ను ఐమ్యాక్స్, డాల్బీ, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ లలో విడుదల చేస్తున్నట్లు గతంలోనే నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే 2డీ వెర్షన్‌కు సంబంధించిన ప్రింట్‌ను రెడీ చేసిన మేకర్స్ డిసెంబర్ 4న రాత్రి 9.30కే తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో పుష్ప-2 ప్రీమియర్ షో వేయనున్నారు.