భారతీయ రైల్వేలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) మరో నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. త్వరలోనే పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 1036 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. వీటిల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ హిందీ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత ఉంటే జనవరి 7 నుంచి ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ద్వారా మరింత సమాచారం తెలియనుంది.
మొత్తం 1036 పోస్టులకు గాను పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 187 ఉండగా, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 338, సైంటిఫిక్ సూపర్ వైజర్ (ఎర్గోనామిక్స్ అండ్ ట్రైనింగ్) పోస్టులు 3, చీఫ్ లా అసిస్టెంట్ 54, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 20, ఫిజికల్ ట్రెనింగ్ ఇన్‌స్ట్రక్టర్ 18, సైంటిఫిక్ అసిస్టెంట్ 2, జూనియర్ ట్రాన్స్‌లేటర్ హిందీ 130, సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ 3, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ 59, లైబ్రేరియన్ 10, సంగీతం టీచర్ (వుమెన్స్) 3, ప్రైమరీ రైల్వే టీచర్ 188, అసిస్టెంట్ టీచర్ (ఫిమేల్ జూనియర్ స్కూల్) 2, ల్యాబ్ అసిస్టెంట్, స్కూల్ 7, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్ పోస్టులు 12 ఖాళీగా ఉన్నాయి.
ఈ పోస్టులకు గాను ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 7 నుంచి ప్రారంభం కానుండగా ఫిబ్రవరి 6వ తేదీ వరకు గడువు విధించారు . దరఖాస్తు రుసుము రూ.500గా ఉంది. రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన వారు రూ.250 చెల్లిచాలి. మరిన్ని వివరాలను త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించనున్నారు.