రైతుబంధు ప‌థ‌కం.. రైతు భ‌రోసా.. త్వ‌ర‌లోనే రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ‌..

రైతుబంధు ప‌థ‌కం.. రైతు భ‌రోసా.. త్వ‌ర‌లోనే రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ‌..

తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని ప్ర‌జ‌ల కోసం అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. అందులో భాగంగానే రైతుల‌కు రైతు బంధు ప‌థ‌కాన్ని, రైతు బీమాను అందిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం రైతుల‌కు రూ.2 ల‌క్ష‌ల రుణాల‌ను మాఫీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే మ‌రో రూ.13వేల కోట్ల‌ను రైతుల ఖాతాల్లో జ‌మ చేస్తామ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు చెబుతున్నారు. రైతు రుణ మాఫీ అమ‌లు అయిపోయింది క‌నుక రైతులు ప్ర‌స్తుతం రైతు భ‌రోసా అమ‌లు కోసం చూస్తున్నారు. దీంతో ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే వీరికి శుభ‌వార్త చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. న‌వంబ‌ర్ నెలాఖ‌రు నుంచి రైతు భ‌రోసాను పంపిణీ చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఇందుకు గాను అవ‌స‌ర‌మైన నిధుల‌ను స‌ర్దుబాటు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే ఆర్థిక శాఖ‌ను ఆదేశించార‌ని తెలుస్తోంది. ముందుగా 1 ఎక‌రం నుంచి మొద‌లు పెట్టి డిసెంబ‌ర్ చివ‌రి వారం వ‌రకు పూర్తిగా రైతు భ‌రోసాను అందించాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం పంట పెట్టుబ‌డి కోసం రైతు బంధు పేరిట ఎక‌రానికి ఏడాదికి రూ.10వేలు ఇచ్చింది. ఖ‌రీఫ్‌, ర‌బీ రెండు విడత‌ల్లో రూ.5వేల చొప్పున మొత్తం రూ.10వేల‌ను ఇచ్చేవారు. ఇదే ప‌థ‌కా్ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం రైతు భ‌రోసాగా పేరు మార్చారు. ఎక‌రానికి రూ.15వేల‌ను రెండు విడ‌త‌ల్లో ఇస్తామ‌ని ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చారు. కానీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఇప్ప‌టికే ఏడాది పూర్తి కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ ఈ ప‌థ‌కాన్ని ఇంకా అమ‌లు చేయ‌డం లేదు. కాగా గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం సాగులో లేని కొండ‌లు, గుట్ట‌లు, రియ‌ల్ ఎస్టేట్ భూముల‌కు సైతం రైతు బంధు నిధుల‌ను ఇచ్చింద‌ని ప్ర‌స్తుతం ఉన్న మంత్రులు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌క్కాగా విధి విధానాలు ఖ‌రారు చేసి కేవ‌లం సాగులో ఉన్న భూముల‌కే రైతు భ‌రోసా అందిస్తామ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

very soon raithu bandhu or raithu bharosa money will be credited

ఈ ఏడాది ద‌స‌రా నుంచే రైతు భ‌రోసాను పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కానీ కొంద‌రు రైతుల‌కు రుణ‌మాఫీ కాలేదు. దీంతోపాటు మ‌రికొన్ని ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు నిధులు స‌ర్దుబాటు చేశారు. అందువ‌ల్ల రైతు భ‌రోసాను అమ‌లు చేయ‌లేక‌పోయారు. అయితే న‌వంబ‌ర్ నెల చివ‌రి వారం నుంచి రైతు భ‌రోసాను అమ‌లు చేసి ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. ప్ర‌తి 10 రోజుల‌కు రూ.1500 కోట్ల నుంచి రూ.2వేల కోట్ల వ‌ర‌కు రైతు భ‌రోసా డ‌బ్బుల‌ను రైతుల ఖాతాల్లో జ‌మ చేసేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు స‌మాచారం. 45 రోజుల్లో మొత్తం రూ.7వేల కోట్ల‌ను రైతుల ఖాతాల్లో జ‌మ చేస్తార‌ని తెలుస్తోంది.

కాగా రైతు భ‌రోసాను ఎన్ని ఎక‌రాల వ‌ర‌కు ప‌రిమితం చేయాల‌నే విష‌యంపై ఇప్ప‌టికే అన్ని జిల్లాల్లోనూ స‌భ‌లు నిర్వ‌హించి ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాల‌ను సేక‌రించారు. చాలా మంది రైతులు 10 ఎక‌రాల వ‌ర‌కు పెట్టుబ‌డి స‌హాయం ఇవ్వాల‌ని కోరారు. కొంద‌రు ఏడున్న‌ర ఎక‌రాల‌కు చాల‌ని అన్నారు. దీంతో అభిప్రాయాల‌ను సేక‌రించిన క్యాబినెట్ స‌బ్ క‌మిటీ రైతు భ‌రోసాను ఎన్ని ఎక‌రాల వ‌ర‌కు ప‌రిమితం చేయాల‌నే నిబంధ‌న‌ల‌కు సంబంధించిన డ్రాఫ్ట్స్ ను త‌యారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ డ్రాఫ్ట్స్‌పై త్వ‌ర‌లోనే అసెంబ్లీలో చ‌ర్చించి తుది నిర్ణ‌యం నిర్ణ‌యం తీసుకుంటార‌ని అంటున్నారు. మ‌రి రైతు భ‌రోసా ఎప్పుడు అందుతుందో చూడాలి.